Police services at your fingertips with just a phone call ఒక ఫోన్ కాల్‌తో మీ వద్దకే పోలీసు సేవలు

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో ప్రజల వద్దకే పోలీసు సేవలు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS.

ఒక ఫోన్ కాల్‌తో మీ వద్దకే పోలీసు సేవలు
సంఘటన స్థలానికే చేరుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్న పోలీసులు
అత్యవసర సమయంలో ప్రజలకు అండగా జిల్లా పోలీసులు

నారాయణపేట: ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో నారాయణపేట జిల్లా పోలీసులు ఆన్‌సైట్ -ఎఫ్‌ఐఆర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిర్యాదు దారులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, సంఘటన జరిగిన ప్రదేశానికే వెళ్లి ఫిర్యాదులను స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఈ విధానం ద్వారా బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, నమ్మకమైన పోలీసు సేవలు అందించాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తోంది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో, సంఘటన స్థలానికే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతోంది. ప్రత్యేకించి మహిళపై అత్యాచారాలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చోరీలు, గొడవలు, మిస్సింగ్ కేసులు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగులు, వృద్ధులు, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ సేవ ఎంతో మేలు అనేక సందర్భాల్లో ప్రజలుఅత్యవసర సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో 100 డయల్ కు గాని లేదా సంబంధిత పోలీస్ అధికారికి నేరుగా ఫోన్ చేసి సమాచారం అందజేస్తే పోలీసు అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి తక్షణ చర్యలు ప్రారంభిస్తారు. సమస్య ఎక్కడ జరిగినా… ప్రజలకు పోలీసు సహాయం త్వరగా అందాలన్నదే మా లక్ష్యం. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు కేసుల దర్యాప్తు మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని, జిల్లా పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించే దిశగా కృషి చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించి బాధితులకు న్యాయం అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ తెలిపారు.
ఈ విధానం ద్వారా ఇప్పటికే పలు కేసుల్లో బాధితులకు వేగవంతమైన న్యాయం అందుతున్నట్లు తెలిపారు. భయపడకుండా ముందుకు వచ్చి సమాచారం అందిస్తే పోలీసు శాఖ ప్రతి బాధితుడికి అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.

Leave a Comment