వలసల జిల్లాగా ఉన్న నారాయణపేట ను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం

The intention is to make Narayanpet green.నారాయణపేట జిల్లా :పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక,యువజన సేవలు, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ వలసల జిల్లాగా ఉన్న నారాయణపేట ను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో మక్తల్ -నారాయణపేట -కొడంగల్ ఎత్తి పోతల పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
గతంలోఈ ప్రాజెక్ట్ కోసం దశబ్దాలుగా పోరాటం చేసినా ఫలితం శూన్యం అని అన్నారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం లోకి రాగానే పాలమూరు బిడ్డ ముఖ్య మంత్రి గా ఉన్నందుకు ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగి ఇప్పుడు కాట్రేపల్లి నుంచి కాన్ కార్తి వరకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. గతంలో పాలమూరు ప్రజల జీవనం ఆగమ్యగోచరంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మక్తల్- నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తయితే ఇక్కడి ప్రాంతం మరో కోనసీమ అవ్వడం ఖాయమన్నారు. పచ్చని పంట పొలాలతో ఈ ప్రాంతం సస్యశామల్యం అవుతుందన్నారు. ఇకపై నారాయణపేట జిల్లా వలసల జిల్లా కాదని వలసలను తెచ్చుకొనే నారాయణపేట జిల్లా గా మారిపోనుందని మంత్రి తెలియజేశారు.

రాష్ట్ర అభివృద్ధిలో అధికారులు, ప్రజలు.. అందరి సహకారం ఉండాలన్నారు.
మొదట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే ఎవ్వరూ నమ్మలేదని ఇప్పుడు గ్రామ గ్రామానా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాల పండుగలు చేసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. అర్హులైన పేదలు ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉంటే వారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ లు, వార్డ్ మెంబెర్ లు , కౌన్సిలర్లు, చైర్ పర్సన్ లు బాధ్యత గా పని చేసి గ్రామాలను బాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతీ పేద వాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి అన్నారని కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక వరి వేస్తే సిరిని చేశామన్నారు. రైతులు పండించిన వడ్లకు బోనస్ తో పాటు గిట్టు బాటు ధర ఇచ్చి మరీ కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రతీ పేదవాడికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం రేషన్ షాప్ ల ద్వారా ఇస్తున్నామని తెలిపారు. ప్రతీ గ్రామానికి రేషన్ షాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది ఉండకుండా చూడాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారుల పాత్ర చాలా అవసరమన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పెండింగ్ ఫైల్స్, పనులు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం అధికారులను విశ్వసించి, నమ్మి 99 రోజుల కార్యాచరణ ఇచ్చిందని, అధికారులు తమ బాధ్యత ను విస్మరించ వద్దని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే మున్సిపల్ చైర్ పర్సన్ లు, కౌన్సిలర్లు, సర్పంచులకు అధికారులు గౌరవం ఇచ్చి వాళ్ళు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. తన రాజకీయ జీవితం సర్పంచ్ నుంచే ప్రారంభమైందని చెప్పారు. ఈ సారి పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన సర్పంచులలో అధికంగా యువకులే ఉన్నారని, వారి హయాంలో తమ తమ గ్రామాలకు ఏదైనా చేయాలనే తపన వారిలో ఉందన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వారి ఆర్ధిక స్వావలంబనకు ప్రభుత్వం తోడ్పాటు అందించిందని మంత్రి తెలిపారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ల నిర్వహణ, ఆర్టీసి అద్దె బస్సుల నిర్వహణ చేస్తున్నారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక మాట్లాడుతూ…
రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ఫలితాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడంతోపాటు అర్హులైన వారందరికీ పథకాలు అందించేలా గ్రామ, వార్డు సభలు జరిగాయని అన్నారు. విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, అసుపత్రులను తీర్చిదిద్దే ప్రణాళికను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. స్థలాలు ఉండీ ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నూరుశాతం అమలు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా సర్కారు అమలు చేయనుందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా చేపట్టనుందనీ తెలిపారు. ఈ 99-రోజుల కార్యాచరణ ప్రణాళిక మార్చి 6న ప్రారంభమై, జూన్ 12 వరకు కొనసాగుతుందన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవమును ఘనంగా జరుపుకుంటామనీ గుర్తు చేశారు. 5 స్థాయిలలో ఈ కార్యక్రమం జరుగుతుందని, గ్రామ స్థాయి – ఏప్రిల్ 2 నుంచి,
16 న మండల స్థాయిలో, మే 2 న నియోజక వర్గ స్థాయి, మే 22 న జిల్లా స్థాయిలో, జూన్ 2 న రాష్ట్ర స్థాయి లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు జరుగుతాయని ఆమె తెలిపారు. ఈ 99 రోజుల కార్యక్రమం లో 10 ధీమ్స్ ఉంటాయనీ, 10 థీమ్స్ కోసం వివిధ శాఖలు వారి వారి అంశాల ప్రకారం ముందుకు సాగుతాయన్నారు.
తొలివారం:
మార్చి 30 నుంచి ఏప్రిల్ 4- గ్రామీణాభివృద్ధి సంస్థ,
రెండోవారం:
ఏప్రిల్ 6-11 – ఆరోగ్యరంగం, మూడోవారం: ఏప్రిల్ 13-18 – అరైవ్ అలైవ్ పోలీసు శాఖ, నాలుగో వారం: ఏప్రిల్ 20-25 సంక్షేమం, ఐదో వారం: ఏప్రిల్ 27 నుంచి మే 2- పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట, ఆరో వారం: మే 4-9- రైతు సంక్షేమం, ఏడో వారం: మే 11-16- విద్యాశాఖ, ఎనిమిదో వారం: మే 18-23 – యువత, క్రీడలు, తొమ్మిదో వారం: మే 25-30 – మహిళా సంక్షేమం, పదోవారం: జూన్ 1-6 -పర్యావరణం ఉంటాయన్నారు.
గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత లో భాగంగా 272 గ్రామ పంచాయతి కార్యాలయాలను, 1181 ప్రభుత్వ కార్యాలయాలను, 472 km రోడ్లను, 563 OHSR లను శుభ్రపరచనైనదనీ, 1886 కిలోల ఘన వ్యర్ధాలను, 230కిలోల వ్యర్థాలను తొలగించడం జరిగిందని, 151 గ్రామ పంచాయతిలలో ఫాగింగ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
ఆరోగ్యరంగం పరంగా మొదటి దశలో (06 మార్చి 31 మార్చి) మాతృ, శిశు, కిశోర మరియు వృద్ధుల ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించబడింది. PHCలలో స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహించి ANC నమోదు, అనీమియా నియంత్రణ, పోస్ట్ నాటల్ ఫాలోఅప్, RBSK స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టారనీ , CPR, మెన్రువల్ హైజీన్, మెంటల్ హెల్త్ పై IEC కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వృద్ధుల ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, 14-16 సంవత్సరాల బాలికలకు హెచ్ పీ వీ టీకాలు అందించడం జరిగిందని చెప్పారు.
అరైవ్ అలైవ్, సంక్షేమ శాఖ, ఇందిరమ్మ ఇండ్ల పథకం, కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన నిధులు, లబ్ధిదారుల వివరాలను కలెక్టర్ వివరించారు. కాగా కార్యక్రమంలో భాగంగా అంతకు ముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సీ ఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ డీ సీ రాజేందర్ గౌడ్, ఆర్డీవో రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, నారాయణ పేట , మక్తల్, కోస్గి మున్సిపల్ చైర్ పర్సన్ లు కొండా శ్వేతా సత్య యాదవ్, వాకిటి మానస, నాగుల పల్లి నరేందర్, పేట ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా మత్స్య సహకార సంస్థ ఛైర్మన్ కాంత్ కుమార్, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, దామర గిద్ద విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, స్థానిక పుర వైస్ చైర్ పర్సన్ మంజుల, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment