ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
నారాయణపేట: వేసవి కాలం పిల్లలకు సెలవుల ఉన్నందున, ప్రజలు, విహారయాత్రలకు తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని దొంగలు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, ఊరికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లేదా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో తెలిపారు.
వేసవి సెలవులలో ఇంటికి తాళం వేసి, ఇతర ప్రాంతాలకు, విహారయాత్రలకు వెళ్ళేవారు, అలాగే రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని కొన్ని సూచనలు చేశారు.
ఇంట్లో బంగారు, వెండి నగలు, విలువైన వస్తువులు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం మంచిది అని తెలిపారు. ఊరికి వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి. ద్విచక్ర వాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలి రోడ్డుపై నిలపరాదు.
విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. బయట పార్క్ చేసే వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ కూడా వేయాలి. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. సీసీ కెమెరాలను ఇంటర్నెట్‌కు అనుసంధానం చేస్తే మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా ఇంటిని పర్యవేక్షించవచ్చు. తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలి. సమీప పోలీస్ స్టేషన్ అధికారులు, ఇతర అధికారుల ఫోన్ నంబర్లు సెల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల గురించి డయల్ 100 లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670399 కు సమాచారం ఇవ్వాలి. సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మీ ఇంటి యొక్క లొకేషన్ ను మరియు ప్రయాణ తేది వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తే, మీ ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేయడం జరుగుతుంది. దొంగతనం జరిగినట్లు అనుమానం వచ్చిన వెంటనే నేరాస్థలం యొక్క లొకేషన్ ను సంబంధిత పోలీసులకు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ కు తగిన వివరాలతో సమాచారం అందించాలి అని కోరారు.