
◆ తల్లి పాల వారోత్సవాలలో భాగంగా జాజాపూర్ గ్రామ రైతు వేదికలో జ్యోతి ప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రియాంక,
◆ బాలింతలు, గర్భిణిలను ఉద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్.
◆ పౌష్టికాహార ప్రదర్శన ను తిలకిస్తున్న కలెక్టర్.
◆ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న కలెక్టర్.
◆ తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం లాంటివి
తల్లిపాలు అనేవి కేవలం ఆహారం మాత్రమే కాదని, బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన తొలి రక్షణ కవచమని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణపేట మండలం జాజాపూర్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి గంటలో వచ్చే లేత పసుపు రంగు పాలను ముర్రుపాలు (కొలస్ట్రం) అని పిలుస్తారని, చాలామంది దీనిని సాధారణ పాలుగా భావించినప్పటికీ, వాస్తవానికి అది బిడ్డకు అందించే తొలి టీకా వంటిదని తెలిపారు. శిశువులో రోగనిరోధక శక్తిని పెంచి, అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే గుణాలు ఈ పాలలో ఉంటాయని చెప్పారు. అందువల్ల ప్రతి బిడ్డకు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.
ఇటీవలి కాలంలో తల్లిపాల విషయంలో అనేక అపోహలు వ్యాపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా సిజేరియన్ ప్రసవం అనంతరం పాల బాటిళ్లు కొనుగోలు చేయాలని లేదా బిడ్డకు తేనె, ఇతర పదార్థాలు ఇవ్వాలని కొందరు సూచిస్తున్నారని, ఇవన్నీ శాస్త్రీయంగా సరైనవి కావని ఆమె స్పష్టం చేశారు. పిల్లలను కనడం, తల్లిపాలు ఇవ్వడం అనేవి ప్రకృతి సిద్ధమైన ప్రక్రియలని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా వైద్యుల సూచనలను మాత్రమే పాటించాలని కోరారు.
బిడ్డ పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, నీరు, తేనె, పాలపొడి లేదా ఇతర ఆహార పదార్థాలు అవసరం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో తల్లికి వెంటనే పాలు రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదని, మంచి పోషకాహారం తీసుకుంటూ వైద్యుల సలహాలు పాటిస్తే తల్లిపాలు సహజంగానే వస్తాయని తెలిపారు.
గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అయితే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఆరోగ్యం చాలాసార్లు నిర్లక్ష్యానికి గురవుతుందని అన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని పేర్కొన్నారు. పాలిచ్చే తల్లులు కూడా పోషకాహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచన మేరకు ఐరన్, కాల్షియం మాత్రలను కొనసాగించాలని సూచించారు.
పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినకూడదనే అపోహలు ఇప్పటికీ ఉన్నాయని, అయితే శాస్త్రీయంగా అలాంటి నిషేధాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పాలు, గుడ్లు, నాన్వెజ్ వంటి సమతుల ఆహారాన్ని వైద్యులు నిషేధించనంత వరకు తీసుకోవచ్చని తెలిపారు. మన ఇంట్లో పండించే జామపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులే ఉత్తమ పోషకాహారమని, ఖరీదైన విదేశీ పండ్ల కోసం వెతకాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆరు నెలలు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు మెత్తగా చేసిన అన్నం, పప్పు, కూరగాయలు వంటి ఘన ఆహారాన్ని ప్రారంభించాలని, అదే సమయంలో తల్లిపాలను కూడా కొనసాగించాలని సూచించారు.
ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థకు మొదటి దూతలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గర్భిణికి సరైన అవగాహన కల్పించి, సురక్షిత ప్రసవానికి మార్గనిర్దేశం చేయడంతో పాటు తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి వివరించాలని సూచించారు.
ఇటీవలి కాలంలో తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు కూడా కనిపిస్తున్నారని, అలాంటి వారిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమయానికి చికిత్స అందిస్తే తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే సంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. “మొదటి గంటలో తల్లిపాలు… మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే… ఆరోగ్యవంతమైన తల్లి… ఆరోగ్యవంతమైన బిడ్డ… ఆరోగ్యవంతమైన సమాజం…” అనే సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేరవేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) రాజేందర్ గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్ధప్ప, డీసీపీవో కరిష్మా, సీడీపీవో వెంకటేశ్వరమ్మ, కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.