
ఈవీఎం గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించబడుతోందని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు.
బుధవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదామును రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదాం వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ, భద్రతా సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎం గోదామును నిర్దిష్ట వ్యవధిలో తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి క్రమం తప్పకుండా సమర్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్, డీటీ రామకృష్ణ, సీ సెక్షన్ అధికారి జయసుధ తదితర అధికారులు పాల్గొన్నారు.