
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరంగా బలమైన పునాది వేసి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం అంకితం చేశారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన అందించిన మేధోపరమైన మార్గదర్శకత్వం, నిబద్ధత, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ కేవలం ఉద్యమకారుడే కాకుండా గొప్ప విద్యావేత్త, ఆలోచనాపరుడు, సమాజ సంస్కర్త అని ఎస్పీ కొనియాడారు. యువత ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం, విలువలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. దేశం, రాష్ట్రం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో DCRB డీఎస్పీ మహేష్, ఆఫీస్ సూపర్డెంట్ శ్యామ్ సుందర్ రాజు, SI లు పురుషోత్తం, శ్రీనివాసులు, శ్వేత, శిరీష, వివిధ విభాగాల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళులు అర్పించారు.