
మండలాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనల నివేదికలను వెంటనే సమర్పించాలి.
నారాయణపేట: మండలాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించిన ప్రత్యేక అధికారులు, మండల ఇన్చార్జ్ అధికారులు తమ పర్యటనల నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లాలో నియమించిన ప్రత్యేక అధికారులు తాము సందర్శించిన మండలాల్లో ఉన్న మౌలిక వసతుల లోపాలు, ప్రజలకు అందుతున్న సేవల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధికి అవసరమైన చర్యలు, సేవల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అభిప్రాయాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తదుపరి సమీక్ష సమావేశంలో ప్రతి ప్రత్యేక అధికారిని వారి పరిశీలనలపై అభిప్రాయాలు అడుగుతామని, అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని తెలిపారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండల అధికారులు, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పాఠశాల భవనాల పరిస్థితి, పైకప్పుల లీకేజీలు, విద్యార్థుల భద్రత, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో గుర్తించిన ప్రధాన సమస్యలను కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా, వెంటనే జిల్లా పరిపాలనకు తెలియజేస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు తమ బాధ్యతలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా జిల్లాలోని మద్దూరు, గుండుమల్, కొత్తపల్లి, కోస్గి మండలాలలో కొనసాగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆమె ఆదేశించారు.
అంతకు ముందు సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తమ తమ శాఖలకు మంజూరైన నిధులు, ప్రగతి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ కు క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీ ఆర్ వో రాజేశ్వరి, డిప్యూటీ కలెక్టర్ ఫణి కుమార్, కలెక్టరేట్ ఏ వో అనిల్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.