
పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి
— జిల్లా కలెక్టర్ ప్రియాంక.
నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గత సంవత్సరం నిర్వహించిన పరేడ్ గ్రౌండ్‌లోనే ఘనంగా నిర్వహించాలని తెలిపారు. జెండా ఆవిష్కరణ, పరేడ్, వేదిక, వీఐపీ ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ తదితర అంశాల్లో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లా అధికారులందరూ రెండు రోజుల్లో తమ శాఖల ముఖ్య విజయాలు, ప్రత్యేక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలను పంపించాలని, వాటి ఆధారంగా కలెక్టర్ ప్రసంగాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. కేవలం పాత నివేదికలను పంపకుండా తాజా సమాచారం, ముఖ్యాంశాలు చేర్చాలని సూచించారు.
పోలీస్ శాఖ గార్డ్ ఆఫ్ ఆనర్, డ్రిల్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని, డీపీఆర్ఓ శాఖ నాణ్యమైన సౌండ్ సిస్టమ్, మైక్ ఏర్పాట్లు చేసి ముందస్తుగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అతిథుల ప్రోటోకాల్, సీటింగ్ ఏర్పాట్లను ఆర్డీవో, తహసీల్దార్లు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
ప్రతి శాఖ తమ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, సేవలను ప్రతిబింబించేలా ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యానవనం, చేనేత, ఇందిరమ్మ ఇళ్లు, పశుసంవర్ధక, ఆరోగ్యం, విద్య, క్రీడలు, పరిశ్రమలు, పౌర సరఫరాలు తదితర శాఖలు ఆకర్షణీయమైన స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రతి శాఖ నుంచి అత్యుత్తమంగా పనిచేసిన ముగ్గురు ఉద్యోగుల పేర్లను మాత్రమే పరిశీలించి, ఎలాంటి ఆరోపణలు లేదా క్రమశిక్షణా చర్యలు లేని ఉద్యోగుల వివరాలను ఆగస్టు 7లోపు పంపించాలని తెలిపారు.
మున్సిపల్ శాఖ పారిశుద్ధ్యం, తాగునీరు, వ్యర్థాల తొలగింపు, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శాఖ వైద్య శిబిరం, అంబులెన్స్, అత్యవసర వైద్య సేవలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ, క్రీడల శాఖ స్థానిక విద్యార్థులను పెద్ద సంఖ్యలో సమీకరించాలని సూచించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీ ఈ ఓ కు సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, హాజరు నమోదు చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాగా సమావేశ ప్రారంభంలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు (ఎన్‌రోల్‌మెంట్) కార్యక్రమంలో జిల్లా పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్న కలెక్టర్, సమావేశం ముగిసిన వెంటనే అధికారులు స్వయంగా నమోదు చేసుకోవడంతో పాటు తమ శాఖల సిబ్బంది, ప్రజలను కూడా నమోదు చేయించాలని సూచించారు. వచ్చే నాలుగు రోజుల్లో కనీసం 500 నమోదులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, జెడ్పీ సీ ఈ వో శ్రీనివాస్ రావు, డిఆర్డిఓ వెంకట్ రాములు, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఎస్ డీ సీ రాజేందర్ గౌడ్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామ లింగేశ్వర్ గౌడ్, డీ ఈ ఓ గోవింద రాజులు, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా సివిల్ సప్లై అధికారి బాల్ రాజ్, డీ ఎం సైదులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, ఆర్ అండ్ బీ ఈ ఈ వెంకట రమణయ్య, డీ ఐ ఈ వో సుదర్శన్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, జిల్లా మత్స్య శాఖ అధికారి రెహమాన్, డీ పీ ఆర్ వో రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ అబ్దుల్ ఖలీల్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని బాలా మణి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మెర్సీ వసంత, డీ వై ఈ వో వెంకటేష్ శెట్టి, జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త డాక్టర్ మల్లికార్జున్, చేనేత జౌళి శాఖ ఏ డీ తదితరులు పాల్గొన్నారు.