Collector conducts surprise inspection of Damaragidda Tahsildar office.

దామరగిద్ద తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

నారాయణపేట జిల్లా దామరగిద్ద తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) ఇద్దరూ లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లారని సీనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. వారు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినట్లు సీనియర్ అసిస్టెంట్ వివరించారు.
అనంతరం రిజిస్ట్రేషన్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, మంగళవారం ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యాలయ ఆవరణలో ఓ మూలన ఫైళ్లను మూటకట్టి ఉంచడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్లను ప్రత్యేక గదిలో భద్రంగా భద్రపరచకుండా ఇలా నిర్లక్ష్యంగా ఎందుకు ఉంచారని సీనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు.
తదనంతరం పక్కనే ఉన్న ఎంపీడీవో కార్యాలయాన్ని కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ప్రస్తుతం చేపడుతున్న ఉపాధి హామీ పనులు ఏమిటి, ఫామ్ పాండ్ల నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయనే వివరాలను ఎంపీడీవో సాయిలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత దామరగిద్ద తండాలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని, ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా తండాకు నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్ శరణ్ నాయక్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున తండా విద్యార్థులను దామరగిద్ద మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
అయితే మండల కేంద్రంలోని పాఠశాలకు వెళ్లేందుకు తండా విద్యార్థులు ఆసక్తి చూపరని, తద్వారా గైర్హాజరు అయ్యే అవకాశముందని సర్పంచ్ వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, తండాకు రెండు ప్రైవేట్ పాఠశాల బస్సులు వస్తున్నాయని, వాటిలో విద్యార్థులు వెళ్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు వెళ్లలేరని ప్రశ్నించారు.
ఎలాగైనా తండాకు నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్ శరణ్ నాయక్ మరోసారి కలెక్టర్‌ కు విజ్ఞప్తి చేశారు.

Leave a Comment