ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి*

——– జిల్లా కలెక్టర్ ప్రియాంక.

నారాయణపేట జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని ఆమె తెలిపారు.
మంగళవారం మద్దూరు (మండలం)మున్సిపాలిటీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు గృహప్రవేశం పూర్తయిన మరో ఇంటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామానికి మంజూరైన ఇండ్ల వివరాలను హౌసింగ్ పీడీ శంకర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూఫ్ స్థాయిలో ఉన్న ఇంటి లబ్ధిదారురాలు, స్లాబ్ స్థాయిలో ఉన్న ఇంటి లబ్ధిదారురాలితో మాట్లాడి నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు.
ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని లక్షల రూపాయల బిల్లులు అందాయి, మిగిలిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సెప్టెంబర్ నెలాఖరులోగా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన మెనూ, వంటగదిని పరిశీలించారు. పాఠశాలలో మొత్తం 50 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిలో ఒకరు భీంపూర్ పాఠశాలకు రాకుండా గతంలో విధులు నిర్వహించిన పాఠశాలకే వెళ్తున్నారని తెలుసుకున్న కలెక్టర్, వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) గోవిందరాజుకు ఫోన్ చేసి సంబంధిత ఉపాధ్యాయుడిని తక్షణమే భీంపూర్ పాఠశాలకు పంపించాలని ఆదేశించారు.
అదేవిధంగా, పాఠశాలలో అదనపు గది నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో పాటు భవనం ఫ్లోరింగ్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయించాలని డీఈఓకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మద్దూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ మహేష్, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment