
రైతులకు నానో ఎరువులు, పీఎస్బీ పంపిణీ
సింగారంలో రైతులకు అవగాహన – క్షేత్రస్థాయిలో వినియోగంపై ప్రదర్శన.
నారాయణపేట మండలం సింగారం గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK), నారాయణపేట ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ మరియు ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (PSB)లను పంపిణీ చేశారు. TRVK నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ రైతులకు వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా డా. సత్యనారాయణ మాట్లాడుతూ, నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం ద్వారా పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. అలాగే, నేలలో మొక్కలకు అందుబాటులో లేని భాస్వరాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో PSB బయోఫెర్టిలైజర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, రైతులు దీన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
అనంతరం రైతుల పొలంలో వరి నారు వేర్లను నానో డీఏపీ ద్రావణంలో ముంచే (root dipping) పద్ధతిపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. నారు నాటే ముందు నానో డీఏపీ వినియోగించే విధానాన్ని రైతులకు వివరించారు. అదేవిధంగా వరి పంటలో PSB వినియోగంపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించి, దాని ఉపయోగాలు మరియు వినియోగ విధానాన్ని వివరించారు.
రైతులు శాస్త్రీయ ఎరువుల వినియోగ పద్ధతులను పాటిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని డా. సత్యనారాయణ సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ, AEO రమేష్ మరియు సింగారం గ్రామ రైతులు పాల్గొన్నారు.