పీఎం ఇంటర్న్‌షిప్ పథకంపై విస్తృత అవగాహన కల్పించి అధిక దరఖాస్తులు నమోదు చేయాలి.—— జిల్లా కలెక్టర్ ప్రియాంక.

 

నారాయణపేట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) – రౌండ్–3 జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం యువతకు పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించి, వారి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రతిష్టాత్మక కార్యక్రమమని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రతి యువతకు ఈ పథకం వివరాలను చేరవేసి, అధిక సంఖ్యలో దరఖాస్తులు నమోదు అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ, ఉపాధి శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ, సంక్షేమ శాఖలు, అలాగే ఇతర సంబంధిత శాఖలు తమ పరిధిలోని అర్హులైన యువతను గుర్తించి పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఐటీఐలు, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు పూర్తి సమాచారం అందించి, అర్హులైన ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలోని ప్రతి అర్హులైన యువతకు పథకం వివరాలు చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, అధిక సంఖ్యలో దరఖాస్తులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్ గౌడ్ పథకం ముఖ్యాంశాలను వివరించారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా టాప్–2000 కంపెనీలు మరియు ఇతర అర్హత కలిగిన సంస్థల్లో 1.10 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన భారతీయ యువత పీ.ఎం. ఐఎస్ పోర్టల్ ద్వారా దేశంలోని తమకు నచ్చిన రాష్ట్రం, జిల్లా, పరిశ్రమ రంగం, ఉద్యోగ విభాగంలో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9,000 స్టైపెండ్, ఒకసారి రూ.6,000 ప్రోత్సాహక గ్రాంట్, అలాగే
పీఎం జే జే బీ వై/ పీఎం ఎస్ బీ వై పథకాల కింద బీమా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. చివరగా పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/బీసీ సంక్షేమ అధికారి, మెప్మా కో-ఆర్డినేటర్, వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Comment